హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితంపై మంత్రి హరీశ్‌రావు స్పందన

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని, అయితే.. దేశంలో ఎక్కడా లేని విధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పని చేశాయని.. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లే చెబుతున్నారన్నారు. జాతీయస్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఏది ఏమైనా టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క ఎన్నికతో కుంగిపోదని, గెలిచిననాడు పొంగిపోలేదన్నారు. ఓడినా.. గెలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పని చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.