స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేడ్-1సబ్ రిజిస్ట్రార్ల చిట్టా ఆ శాఖ కమిషనర్‌కు చేరింది. శాఖలోని అవినీతిపరులను ఏరివేయాలని కమిషనర్ శేషాద్రి ఇటీవల డీఐజీ (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్)లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డీఐజీలు జిల్లాల వారిగా స్పెషల్ ఆడిట్, విచారణ, తనిఖీలు నిర్వహించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్రిజిస్ర్టార్లపై ఒక నివేదికను కమిషనర్‌కు అందించారు. ఇందులో వరంగల్ జిల్లాలో ఇద్దరు, వికారాబాద్ జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్ జిల్లాలో నలుగురు, మేడ్చల్ జిల్లాలో ఒకరు, నల్గొండ జిల్లాలో ఇద్దరు గ్రేడ్-1 సబ్రిజిస్ర్టార్లు ఉన్నట్లు తెలిసింది. వారిలో ఎక్కువగా గ్రేడ్-1 సబ్రిజిస్ర్టార్లు ఉన్నట్లు సమాచారం. చర్యలు తప్పవని భావిస్తున్న ఓ ఇద్దరు సబ్రిజిస్ర్టార్లు ఇప్పటికే సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. ఇటీవల గ్రూప్-2 ద్వారా ఎంపికైన గ్రేడ్-2 స్థాయి సబ్రిజిస్ర్టార్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ర్టేషన్లు చేస్తున్నట్లు తెలిసింది. వారిని సస్పెండ్ చేస్తారా? లేక బదిలీలతో సరిపెడతారా? అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.
