వ్యవసాయ చట్టాల రద్దుకు 24న కేంద్ర కేబినెట్‌ భేటీ

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 24న కేంద్ర కేబినెట్‌ భేటీ కానున్నది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

గత ఏడాది పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు. కేంద్రం దిగి రాకపోవడంతో నిరసనలను తీవ్రం చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 22న లక్నోలో కిసాన్ మహాపంచాయత్‌, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజైన 29న పార్లమెంట్‌ వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని కిసాన్‌ సంయుక్త మోర్చా వెల్లడించింది.

కాగా, చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. శుక్రవారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించడంతోపాటు రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.