తెలంగాణ సచివాలయంలో భారీగా ఉద్యోగుల బదిలీ, పోస్టింగ్‌లు

సచివాలయంలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు 125 మందిని ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలో సెక్షన్‌ అధికారులు, అసిస్టెంట్‌, డిప్యూటీ, జాయింట్‌, అడిషన్‌ కార్యదర్శుల పదోన్నతులను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ నెలలో ఇచ్చింది. పదోన్నతులు కల్పిస్తూ ఆయా అధికారులకు అదే రోజు ఆయా స్థానాల్లోనే పోస్టింగ్‌ ఇచ్చింది.

పదోన్నతులు వచ్చిన వివిధ కేడర్‌లకు చెందిన 125 మంది అధికారులు, ఉద్యోగులకు పోస్టింగ్‌లకు సుదీర్ఘంగా కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బదిలీలు చేసి, పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేస్తూ పోస్టింగ్‌లు ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగులు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌కు, పదోన్నతుల కోసం కృషి చేసిన తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్‌రావుకు సచివాలయ ఉద్యోగులు కృతజ్ఞతలు చెప్పారు.

సీఎం కేసీఆర్‌ చంద్రశేఖర్‌రావు పెద్ద మనసుతో సచివాలయంలో పని చేసే ఉద్యోగులు, అధికారులకు ఒకేసారి పదోన్నతులు కల్పించి, పోస్టింగులు ఇచ్చారన్నారు. సీఎం ఆదేశాల మేరకు కాలాతీతం కాకుండా వెంటనే పదోన్నతులు కల్పించిన సీఎస్‌కు సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.