ధ్రువీకరణ పత్రాలు అందుకున్న ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి శుక్రవారం కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, బి గోపి ధ్రువీకరణ పత్రం అందజేశారు. శ్రీనివాస్ రెడ్డికిమంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, రెడ్యానాయక్, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జగదీశ్వర్, డిసిసిబి చైర్మన్ రవీందర్‌రావు, టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.

కాగా, ఆదిలాబాద్‌ జిల్లాలో 1, నల్లగొండ 1, మెద‌క్ 1, ఖ‌మ్మం 1, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు డిసెంబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్నాయి. ఆదిలాబాద్ నుంచి దండె విఠ‌ల్, న‌ల్ల‌గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖ‌మ్మం నుంచి తాతా మ‌ధు, మెద‌క్ నుంచి డాక్ట‌ర్ వంటేరి యాద‌వ‌రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి భానుప్ర‌సాద్ రావు, ఎల్ ర‌మ‌ణ బ‌రిలో ఉన్నారు.