ఆకుపచ్చ రంగులోకి మారిన కృష్ణా నది నీళ్లు

కృష్ణా నది జలాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని అమరగిరి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌ వరకు వారం రోజులుగా నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. గతంలో ఎన్నడూ కృష్ణా నది నీళ్లు ఇలా రంగు మారలేదని నదీతీర గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లా పరిసర ప్రదేశాల్లో ఉన్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు నదీలో కలవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు. నీరు రంగు మారడంతో చేపలు మృతి చెందే ప్రమాదం ఉన్నదని జాలర్లు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను నదిలోకి వదలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమలే కాకుండా తెలంగాణలోని కొన్ని పరిశ్రమలు కూడా వాటి నుంచి వచ్చే వ్యర్థాలను కృష్ణా నదీలో కలుపుతున్నాయి అని కృష్ణా నదీతీర గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇలాంటి పరిశ్రమలపై వెంటనే కఠిన చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని కృష్ణా నదీతీరం వెంట ఉన్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యాన్ని కట్టడి చేస్తేనే కృష్ణా నదిని కాపాడుకోగలమని లేదంటే మా బతుకులు ఆగమైతాయి అని అక్కడి స్థానిక ప్రజలు వాపోతున్నారు. కృష్ణా నదీ నీటిని కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై ఎన్ని ఫిర్యాదులు చేసిన వాటిపై అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమని.. కాబట్టి ప్రభుత్వమే స్పందించి ఇలాంటి పరిశ్రమలను మూసివేసి కృష్ణా నదీ నీటిని కాలుష్యం చేయకుండా కాపాడాలని కృష్ణా నదీతీర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.