ప్రగతిభవన్లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్.. మంత్రులతో చర్చించారు. అనంతరం కోవిడ్ టీకాల పురోగతి, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంపై సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు.
పలు దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిపై చర్చించిన సీఎం కేసీఆర్.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొత్త వేరియంట్ నేపథ్యంలో ఏవిధంగా అప్రమత్తంగా ఉన్నామన్న దాని గురించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక అందజేశారు. కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేశాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రలకు సూచించారు.
సుమారు ఐదు గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వరి ధాన్యం బఫర్ స్టాక్ పెట్టుకోవడం కేంద్రం బాధ్యతని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. తన సామాజిక బాధ్యతను కేంద్రం విస్మరిస్తోందని అన్నారు. తన విధానాలతో రైతాంగాన్ని కేంద్రం గందరగోళ పరుస్తోందని తెలిపారు. లాభ నష్టాలు బేరీజు వేసుకుంటే అది ప్రభుత్వం అవుతుందా? అని నిలదీశారు.