తెలంగాణ హరితనిధి ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ హరితనిధి (Telangana Green Fund) ఏర్పాటుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హరితనిధిపై గతంలో రాష్ట్ర శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సేకరించిన విరాళాలతో నిధులు సమకూర్చనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. హరితనిధికి నోడల్‌శాఖగా అటవీశాఖ వ్యవహరించనున్నది. అటవీశాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

ప్రజాప్రతినిధులు హరితనిధి కింద రూ.500 ఇవ్వాలని కోరగా.. సముఖత వ్యక్తం చేసినట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ అధికారులంతా వారి జీతం నుంచి నెలానెలా గ్రీన్‌ఫండ్‌కు రూ.100 ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి 2015లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2021 నవంబర్‌ నాటికి 239కోట్లకుపైగా మొక్కలు నాటిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్టు అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు జమ చేయాలని, దీనితోపాటు పలు ఇతర మార్గాల ద్వారా గ్రీన్‌ఫండ్‌కు నిధులు సమకూర్చుతామని వెల్లడించారు.