గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి

పచ్చదనం పెంచండి పర్యావరణాన్ని రక్షించండి

ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది

పచ్చదనం పెంపొందించుటకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి స్వీకరించి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, నిర్మల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోరిపల్లి విజయలక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ మొక్కలు నాటాలని గ్రీన్ చాలెంజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ,పచ్చదనం పెంపు కోసం చేపట్టిన హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పథకాలు భావితరాల క్షేమం, మానవుని మనుగడ కోసం ఎంతో దోహదపడతాయని అన్నారు. వాతావరణ కాలుష్యం వల్ల సకాలంలో వర్షాలు పడడం లేదని, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, మంచు కొండలు కరిగి పోతున్నాయని తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణం పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కనీసం మూడు మొక్కలను నాటాలి అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటికి నీరు పోసి సంరక్షించాలి అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నారు. పర్యావరణం పెంపొందించేందుకు జిల్లాలో 2018 – 19 సంవత్సరం లో హరితహారం లో భాగంగా కోటి పది లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 100% లక్ష్యం సాధించడం జరిగిందన్నారు 2019 – 20 లో ఇప్పటివరకు 43 లక్షల మొక్కలు నాటడం జరిగిందని వాటిలో 93 శాతం మొక్కలను సంరక్షించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ పురుషోత్తం, జిల్లా పౌరసంబంధాల అధికారి అబ్దుల్ కలీం, కలెక్టరేట్ కార్యాలయం పరిపాలన అధికారి కరీం, టి ఎస్ ఎస్ కళాకారులు నాగరాజు, సుదర్శన్ ,రఘు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.