రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, శాసనసభ్యులు క్రాంతి కిరణ్ లతో గురువారం సమాచార భవన్ లో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అనుకూల ప్రభుత్వమని, జర్నలిస్టుల సంక్షేమ నిధితో కరోనా వచ్చిన జర్నలిస్టులకు అండగా నిలబడిన ప్రభుత్వమని జర్నలిస్టులకు ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని ఈ భేటీలో కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు, చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి వారు తీసుకువచ్చారు. కోవిడ్ మహమ్మారి వలన కొంత మంది జర్నలిస్టులను పోగొట్టుకున్నామని, అంతే కాకుండా ఆర్ధికంగా పలు పత్రికలు ఇబ్బందులకు గురవుతున్నాయని వారు తెలిపారు. ఛైర్మన్ అల్లం నారాయణతో పాటు అంధోల్ శాసన సభ్యులు క్రాంతి కిరణ్ కమీషనర్ కు ఈ విషయాలు వివరించారు. కమిషనర్ అర్వింద్ కుమార్ ఆయా అంశాలపై సానుకూలంగా స్పందించారు. చిన్న పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లను విడుదల చేస్తామని చెప్పారు. అలాగే ముఖ్యంగా జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించి కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్నోకార్యక్రమాలు చేపడుతున్నదని, అందులోభాగంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులను జారీ చేసిందన్నారు. ఈ హెల్త్ కార్డుతో జర్నలిస్టులు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందే అవకాశముందన్నారు.జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల విషయమై మాట్లాడుతూ, అక్రెడిటేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని, కార్డుల పొడగింపు గడవు ముగిసేలోపు ఫిబ్రవరిలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించి అర్హులైన అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు.ఈ సమావేశంలో సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్లు నాగయ్య కాంబ్లే, కిశోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్తదితరులు పాల్గొన్నారు.