అటవీ పార్కుల సమాచారానికో యాప్‌: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అటవీశాఖ అర్బన్‌ పార్కుల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అరణ్య భవన్‌లో మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిధిలో ఉన్న 39 అర్బన్‌ ఫారెస్టు పార్కుల వివరాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. రెండో దశలో మరిన్ని పార్కులకు సంబంధించిన సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేయనున్నట్లు చెప్పారు. కుటుంబంతో కలిసి సేదతీరేందుకు వచ్చే వారికోసం పార్కుల సమచారాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ యాప్‌ను రూపొందించామనిసీఎం కార్యాలయ ఓఎ్‌సడీ (హరితహారం) ప్రియాంక వర్గీస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్‌ శోభ తదితరులు పాల్గొన్నారు.