హైదరాబాద్‌ శివార్లలో మైనింగ్ జోన్ల అక్రమాలపై ఎన్జీటీ విచారణ

హైదరాబాద్ శివార్లలోని మైనింగ్ జోన్ లో అక్రమాలపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు స్వయంగా తనిఖీలు చేయాలని జస్టిస్ కే రామకృష్ణన్, డాక్టర్ కే సత్యగోపాల్ తో కూడిన NGT ధర్మాసనం ఆదేశించింది. అలాగే కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 28 వాయిదా వేసింది.

అక్రమ మైనింగ్ బాధితులైన తెలంగాణకు చెందిన ఇందిరా రెడ్డి, నిఖిల్ రెడ్డి NGT లో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం…అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నదో వచ్చే విచారణలో చెప్పాలని ఆదేశించింది. అక్రమాల మైనింగ్ కార్యక్రమాల వల్ల పర్యావరణానికి కలిగిన హానిని అంచనా వేసేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ మైనింగ్ శాఖ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఫిబ్రవరి 28 వరకు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.