మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. మేడారం జాతరకు ఆర్టీసీ సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి సోమవారం బస్‌భవన్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు సిబ్బందికి స్పెషల్‌డ్రైవ్‌ ద్వారా బూస్టర్‌డోసులను ఇప్పించాలని, హ్యాండ్‌ శానిటైజర్స్, మాస్కులను అందించాలన్నారు.

డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్‌ చేయాలని సూచించారు. ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి మాట్లాడుతూ జాతర బస్సుల రాకపోకల పర్యవేక్షణకు 12 వేల మంది సిబ్బంది, 150 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. 50 సీసీ కెమెరాలతో బస్సుల రాకపోకల వివరాలను తెలిపేందుకు ఆయా బస్టాండులలో ప్రత్యేక కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసినట్లు ఎండీ సజ్జనార్‌ తెలిపారు.