సీఎం జ‌గ‌న్‌ కి థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్

గ‌త ఆరేడు నెల‌ల నుంచి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు ఈ రోజు శుభం కార్డు ప‌డ‌టంతో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కి న‌టులు మెగాస్టార్ చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో చిరంజీవి, ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు, అలీ, ఆర్. నారాయ‌ణ‌మూర్తి, పోసాని, ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, నిర్మాత నిరంజ‌న్ రెడ్డి స‌మావేశ‌మై సినీ ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. అనంత‌రం చిరంజీవితో క‌లిసి మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ మీడియాతో మాట్లాడారు.

చిరంజీవికి థ్యాంక్స్‌ చెప్పాలి. మా అంద‌రి త‌ర‌పున ప్ర‌భుత్వంతో మాట్లాడి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపారు. మా అంద‌రికీ దారి చూపించారు. గ‌త ఆరు నెల‌ల నుంచి సినీ ప‌రిశ్ర‌మ‌లో గంద‌ర‌గోళం నెల‌కొని ఉంది. ఇవాళ ఆ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరికింది. ఇవాళ రిలీఫ్‌గా ఉంది. సీఎం జ‌గ‌న్‌, పేర్ని నానికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ప‌ది ఇర‌వై రోజుల్లో గుడ్ న్యూస్ వింటారు. -మ‌హేశ్ బాబు

సీఎం జ‌గ‌న్‌, చిరంజీవికి థ్యాంక్స్. ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు సీఎం చాలా స‌మ‌యం ఇచ్చారు. సినీ ప‌రిశ్ర‌మ‌ను సీఎం బాగా అర్థం చేసుకున్నారు. మేం అంతా గంద‌ర‌గోళంలో ఉన్నాం. చిరంజీవి చొర‌వ తీసుకుని మా అంద‌రి త‌ర‌పున మాట్లాడి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపారు. సంతోషంగా ఉంది. – ప్ర‌భాస్

పెద్ద‌, చిన్న సినిమాల గురించి సీఎం జ‌గ‌న్ అవ‌గాహ‌న చేసుకున్నారు. హృద‌య‌పూర్వంగా ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం. సినిమా ఇండ‌స్ట్రీపై సీఎం మంచి ఆలోచ‌న‌తో ఉన్నారు. చిన్న సినిమాల‌కు మేలు చేకూరేలా ప్ర‌భుత్వం ఆలోచించ‌డం సంతోషం క‌లిగించే విష‌యం. గ‌త ఆరు నెల‌ల నుంచి నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు చిరంజీవి ప‌రిష్క‌రించారు. – ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి