భువనగిరిలో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అంతకు ముందు  కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిని సీటులో కూర్చుండబెట్టారు.

అనంతరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. అంతకు ముందు యాదాద్రిలో వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌, విల్లాలను సీఎం ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్‌ సూట్‌ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం చేపట్టారు.