సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌ జన్మదిన శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన దిన శుభాకాంక్షలు. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా సీఎం కేసీఆర్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు చెప్పారు.

68వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్‌కు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన ఉద్యమకారుడు అని, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన పరిపాలనా దక్షుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు.

రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్‌, మంత్రి పువ్వాడ అజయ్‌ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.