వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు శుభవార్త. ఈ-చలానా జారీ అయి జరిమానా చెల్లించని వారికి భారీ రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పేదలు, మధ్యతరగతి వారి ఆర్థిక స్థితిగతులతోపాటు బకాయిల చిట్టా ఏటా పెరుగుతుండడంతో రాయితీ కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వాహనాల ఆధారంగా 80, 75, 70, 50 శాతం చొప్పున రాయితీ ఇచ్చేందుకు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు సూచనప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది.
ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో సుమారు 2 కోట్ల ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండగా, రూ.600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ద్విచక్రవాహనదారులు, ఆటోవాలాలే అధికంగా ఉన్నారు. రాయితీతో కూడిన జరిమానా చెల్లించేందుకు మార్చి 1 నుంచి నెలాఖరు వరకు అవకాశమివ్వనున్నారు. మీసేవ, ఈసేవా కేంద్రాలు, టీఎస్ ఈ-చలాన్ పోర్టల్ లేదా ప్రత్యేక లింకు ద్వారా చెల్లింపులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.