కొత్త తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్‌)గా రాకేశ్‌ మోహన్‌ డోబ్రియల్‌

తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌)గా, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ (హెచ్‌వోఎఫ్‌ఎఫ్‌)గా సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి రాకేశ్‌ మోహన్‌ డోబ్రియల్‌ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎం డోబ్రియల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డోబ్రియల్‌ సోషల్‌ ఫారెస్ట్రీ పీసీసీఎఫ్‌ గా, హరితహారం రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

హరితహారం అమల్లో గత ఆరేళ్లుగా కీలక బాధ్యతలతో పాటు ప్రస్తుత ఉన్నతా ధికారుల్లో సీనియర్‌గా ఉండడంతో ప్రభుత్వం డోబ్రియల్‌ను పీసీసీఎఫ్‌గా నియమించింది. ఈ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లాంఛనాలు పూర్తయ్యాక ఆయన పూర్తి స్థాయి పీసీసీఎఫ్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన డోబ్రియల్‌ 1987లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో చేరారు.

శిక్షణ తర్వాత 1989లో పాల్వంచ సబ్‌ డీఎఫ్‌ఓగా మొదటి పోస్టింగ్‌ పొందారు. 1991 –94 వరకు భద్రాచలం డివిజినల్‌ ఫారెస్ట్‌ అధికారిగా పనిచేశారు. అదే హోదా లో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేశారు. కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందాక అదనపు కార్య దర్శి హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో డిప్యుటేషన్‌ పై పనిచేశారు.

అనంతరం స్పెషల్‌ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా పనిచేశారు (2003–14). తెలంగాణ ఏర్పడ్డాక 2015లో అదనపు పీసీసీఎఫ్‌ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరి, విజిలెన్స్, ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ విధులు నిర్వహించారు. 2016 నుంచి హరితహారం నోడల్‌ ఆఫీసర్‌ పనిచేస్తున్నారు. 2020లో పీసీసీఎఫ్‌ ర్యాంకు పొందారు. 2025 ఏప్రిల్‌ వరకు ఆయన సర్వీసులో కొనసాగుతారు. పీసీసీఎఫ్‌గా నియమితులైన డోబ్రియల్‌ను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ శాంతి కుమారి, పదవీ విరమణ చేసిన పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ అభినందించారు.