రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఎగువ సభ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనమంతా కృషి చేద్దామని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ్యులకు సూచించారు. తన బాధ్యత తాను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని చెప్పారు. సీనియర్‌ సభ్యులతో పాటు జూనియర్‌ సభ్యులు సభా సంప్రదాయాలపై అవగాహన పెంచుకుంటూ అందరం కలిసి ముందుకు సాగుదామని అన్నారు. సోమవారం కౌన్సిల్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, కేటీఆర్, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌ గౌడ్, ఎమ్మెల్సీలు టి.జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆయన్ను చైర్మన్‌ సీటు వద్దకు తీసుకెళ్లారు.

సీటులో ఆసీనులైన గుత్తాకు మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. చట్టసభల నిర్వహణలో తెలంగాణ తలమానికంగా నిలుస్తోందని, సభా సంప్రదాయాల విషయంలో ఆదర్శంగా ఉందని తెలిపారు. గతంలో 21 నెలల పాటు కౌన్సిల్‌ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించిన సందర్భంగా సభ గౌరవ మర్యాదలు కాపాడే ప్రయత్నం చేశామన్నారు. ఎగువసభ అధ్యక్ష బాధ్యతలు తనకు మరోసారి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు, ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.