కాటేస్తున్న కాలుష్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే !!

World Health Day 2022 | ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ క‌లుషితం అయిపోయాయి. ఇది ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది. కొంత‌మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా ఏటా కోటి 30 ల‌క్ష‌ల మంది చనిపోతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మన దేశంలో అకాల మరణాలలో 30 శాతం మరణాలకు గాలి కాలుష్యమే కారణమవుతున్నట్టు ” సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్ మెంట్” నివేదిక పేర్కొంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం వల్ల మనుషులతో పాటు జంతువులు, పక్షులు వంటివి కూడా చనిపోతున్నాయి. పరిస్థితులు  ఇలాగే కొనసాగితే రానున్న రోజులు మరింత దారుణంగా ఉంటాయి అంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO). అందుకే దీనిపై అవ‌గాహ‌న కోసం డ‌బ్ల్యూహెచ్‌వో కృషి చేస్తున్న‌ది.

డ‌బ్ల్యూహెచ్‌వో ఏర్పాటైన రోజు ( ఏప్రిల్ 7, 1948). ఈ రోజునే ప్ర‌తి ఏటా ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వంగా జ‌రుపుతున్నారు. ప్ర‌తి ఏటా ఒక థీమ్‌తో ఈ హెల్త్ డేను జ‌రుపుతుంటారు. అలాగే ఈ ఏడాది కూడా కాలుష్యంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ ఏడాది అవ‌ర్ ప్లానెట్ అవ‌ర్ హెల్త్ అనే థీమ్‌తో సెల‌బ్రేట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా స్వచ్ఛ ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాల‌నే అంశంపై రెనోవా హాస్పిట‌ల్స్ ( కొంప‌ల్లి ) క‌న్స‌ల్టెంట్ జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్ డాక్ట‌ర్ న‌రేశ్ గుండ‌పునేని చెప్పిన విష‌యాలు ఒక‌సారి చూద్దాం..

కాలుష్యం వల్ల వచ్చే జబ్బులు:

జబ్బులను ప్రధానంగా ఇన్‌ఫెక్ష‌న్స్‌, పోషణ సమస్యలు, జీవనశైలితో తలెత్తే, క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, వృత్తి / పర్యావరణంతో ముడిపడినవి ఇలా ఆరు రకాలుగా వర్గీకరించవచ్చు. నిజానికి జబ్బులన్నింటికీ నివారణ మార్గాలున్నాయి. వీటికి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి / ప‌ర్యావ‌ర‌ణానికి సంబంధించిన జ‌బ్బులను నూటికి నూరు శాతం నివారించుకునేందుకు వీలుంది. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, మాస్కుల వాడ‌కం, ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు ధ‌రించ‌డం, కాలుష్య నియంత్ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించ‌డం ద్వారా వీటిని నివారించ‌వ‌చ్చు.

జబ్బుల రకాలు

మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ జబ్బులు వంటి సమస్యలకు ఎలాంటి పరిశ్రమలు, ఏయే కాలుష్య కారకాలు, ముడి పదార్థాలు దోహదం చేస్తున్నాయనేది కచ్చితంగా తెలియదు. ఉదాహరణకు గాలిలోని నుసి (పార్టిక్యులేట్ మ్యాటర్) ఇది మనకు తెలియకుండానే మన రక్షణ వ్యవస్థను ఛేదించుకొని ఒంట్లోకి వెళ్తుంది. 2.5 మైక్రాన్ల సైజు నుసి గాలిలో ఎక్కువసేపు తేలియాడుతూ ఉంటుంది. ఇది శ్వాస ద్వారా తేలికగా ఊపిరితిత్తుల లోపలి భాగాలకు చేరుకుంటుంది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి అయ్యే గాలి గదుల వరకు చొచ్చుకుపోవచ్చు. కాలుష్య కారకాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతరత్రా భాగాలకు చేరుకోవచ్చు. ఇది పూడికలకు, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటానికి దారితీసింది. దీంతో రక్తపోటు పెరిగి, క్రమంగా గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది. ఆయా భాగాలలో వాపు ప్రేరేపితం కావటం వల్ల కాలేయ జబ్బులు, క్యాన్సర్లు వంటివి తలెత్తొచ్చు. గాలి కాలుష్యంతో సంతాన లేమి, అల్జీమర్స్ కూడా తలెత్తవచ్చు.

* భూమిలో కలిసే కాలుష్య కారకాలు ఏడీహెచ్ డీ, ఆటిజం వంటి నాడీ సమస్యలకు అలాగే ఎముకల జబ్బులకు దారితీయవచ్చు.

* ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇవి తేలికగా నీటిలోకి, మట్టిలోకి చేరుకుంటాయి. ఇలా నీరు, ఆహార పదార్థాల ద్వారా ఒంట్లోకి ప్రవేశించి, హార్మోన్లతో ముడిపడిన క్యాన్సర్లకు దారితీయవచ్చు.

* నిరంతరం పెద్ద శబ్దాలకు గురవటంతో తలెత్తే చికాకు రక్తపోటు పెరిగేలా చేస్తుంది. ఇది క్రమంగా గుండె జబ్బులకు దారితీయవచ్చు.

* ఇప్పుడు ఇ – వ్యర్థాలు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాడిపారేసిన కంప్యూటర్లు, సెల్ ఫోన్స్ వంటి వాటిలో పాదరసం, కాడ్మియం, బేరియం, సీసం, పాలీక్లోరినేటెడ్ బైఫినైల్ వంటి వెయ్యికి పైగా హానికారక రసాయనాలు ఉంటాయి. ఈ హానికారక రసాయనాల ప్రభావంతో కాలేయం, గుండె, కిడ్నీ, మెదడు, ఎముకల జబ్బులు తలెత్తవచ్చు. గర్భిణులు వీటి ప్రభావానికి గురైతే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, పుట్టుకతోనే శిశువు మరణించడం, శిశువులు డీఎన్ఏ సమస్యలతో పుట్టే అవ‌కాశం ఉంది.

నివారణ చర్యలు

చుట్టూ ఉండే పరిసరాల మీదే మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పీల్చుకునే గాలి, తాగే నీరు కలుషితం కాకుండా తీసుకోవలసిన బాధ్యత మన అందరిదీ. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలల్లో మొక్కలు నాటాలి. ప్లాస్టిక్‌ని పూర్తిగా నివారించాలి. సేంద్రియ సాగు వైపు నడవాలి. కాచి, చలార్చిన లేదా శుద్ధి చేసిన నీళ్లనే తాగాలి. కాలువలు, నదుల్ని శుభ్రంగా ఉంచాలి. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఉపయోగించడం, అలాగే కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగ, బట్టలు ఉతకడానికి వాడే డిటర్జెంట్లు కూడా భూమిని కలుషితం చేస్తాయి. అందుకే సాధ్యమైనంతవరకు సహజ ఉత్పత్తులనే వాడాలి. పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్స్ నుంచి వచ్చే పొగ, విష వాయువుల్ని ఫిల్టర్స్ సాయంతో వాతారణంలోకి చేరకుండా చూడాలి. అప్పుడే మన భూమితో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం.
(సోర్స్: నమస్తే తెలంగాణ)