ఏసీబీకి చిక్కినచౌదరిగూడ బిల్‌ కలెక్టర్‌ రవీందర్‌

లంచం తీసుకొంటూ ఓ పంచాయతీ బిల్‌ కలెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని తార్నాకు చెందిన సిగ్నీ ఆంటోని తన ఇంటిని దుబాయ్‌లో ఉన్న తల్లి పేరిట మ్యుటేషన్‌ చేయాలని బిల్‌ కలెక్టర్‌ రవీందర్‌ను కోరారు. అందుకు ఆయన రూ. 20 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.10 వేలకు అంగీకరించాడు. గురువారం ఉదయం పంచాయతీ కార్యాలయంలో ఆంటోని నుంచి రూ.10 వేలు లంచం తీసుకొంటుండగా రంగారెడ్డి జిల్లా రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ.. బిల్‌ కలెక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.