నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ అభ్యర్థన మేరకు, మర్రిగూడ జంక్షన్లో తొలగించనున్న 30 చెట్లలో 5 చెట్లను ఈ నెల 26న అర్బన్ పార్క్‌లో తిరిగి నాటడానికి ఏర్పాట్లు చేసినట్టు రాజ్యసభ సభ్యుడు, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఇవే కాకుండా మిగతా 25 చెట్లను ఈ నెల చివరికల్లా అర్బన్ పార్క్, ఎన్ఏఎమ్ రోడ్, కలెక్టర్ ఆఫీసు వద్ద నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం అధునాతనమైన భారీ క్రేన్లను, ప్రొక్లైనర్లు, ట్రాన్స్ లోకేట్ చేసినప్పుడు చెట్లు మొడుబారకుండా నూతన పద్ధతులను అవలంభిస్తున్నట్లు వివరించారు.ఇందుకోసం వాటా ఫౌండేషన్ సాంకేతిక సహాకారం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రకృతికి ప్రాణం పోసే ఈ అద్భుతమైన బృహత్ కార్యానికి సహకరిస్తున్న జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిగ, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులకు ఎంపీ సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
