రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు కన్నుమూత

ప్రముఖ రచయిత, కాలమిస్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు (84) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేవులపల్లి ప్రభాకర్‌రావు వరంగల్‌ పట్టణంలో ఆండాళమ్మ, వేంకట చలపతిరావు దంపతులకు 1938లో జన్మించారు.

ఉస్మానియా యూనివర్సి టీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక ప్రచురణ విభాగంలో పనిచేశారు. ఆ తరువాత కుటుంబ సంక్షేమవాణి మాసపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రభూమి, వార్త, ప్రజాతంత్ర పత్రికల్లో అనేక ఏండ్లు కాలమిస్టుగా సేవలందించారు. గోల్కొండ, విశాలాంధ్ర పత్రికల్లో పలు అంశాల మీద రచనలు చేశారు. దేవులపల్లి రాసిన ‘మహాకవి గురజాడ జీవితం-సాహిత్యం’ గ్రంథానికి యునెస్కో అవార్డు లభించింది. జాతీయ సమైక్యతపై రాసిన ‘నేను ఎవరు’ పుస్తకానికి భారత ప్రభుత్వ అవార్డు, అల్లూరి సీతారామరాజు రేడియో నాటికకు జాతీయ అవార్డు అభించాయి. సాహిత్యరంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2009లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం, 2012లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాహిత్య పురస్కారం లభించాయి. 2016 ఏప్రిల్‌ 29న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమితులయ్యారు.