టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నరసింహరాములు ఇండ్లలో ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శేరిలింగంపల్లి జోనల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నరసింహరాములు కార్యాలయం, నివాసాల్లో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో శేరిలింగంపల్లిలోని జోనల్‌ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు.. నరసింహరాములు చాంబర్‌లోని పలు ఫైల్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఆ చాంబర్‌ను సీల్‌ చేసి.. మూసారాంబాగ్‌ శాలివాహననగర్‌లోని ఇంటితోపాటు ఆర్కేపురం డివిజన్‌ గ్రీన్‌హిల్స్‌ కాలనీ రోడ్‌ నం.1లోని సాయి విహార్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో సోదాలు జరిపారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ నేతృత్వంలో గురువారం రాత్రి వరకు కొనసాగిన ఈ సోదాల్లో ఏమేం ఆస్తులను గుర్తించారనే విషయం తెలియాల్సి ఉన్నది. సాయి విహార్‌ అపార్ట్‌మెంట్‌ 3వ అంతస్తులో దాదాపు రూ.2 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌ను కొన్ని నెలల క్రితమే కొనుగోలు చేసిన నరసింహరాములు.. ప్రస్తుతం ఆ ఫ్లాట్‌లోనే నివసిస్తున్నారు.