భూమి సర్వే కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తాసిల్దార్‌, ఆర్‌ఐ

భూసర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు లక్ష లంచం తీసుకుంటూ తాసిల్దార్‌, ఆర్‌ఐ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. అంతర్గాం మండలం అకెనపల్లికి చెందిన మెరుగు శంకర్‌గౌడ్‌కు గ్రామ శివారులో 105, 107 సర్వేనంబర్లలో 14 ఎకరాల భూమి ఉన్నది. సర్వేచేసి భూమికి హద్దులు నిర్ణయించాలని నాలుగు రోజుల క్రితం తాసిల్దార్‌ సంపత్‌కుమార్‌, ఆర్‌ఐ అజిమొద్దీన్‌ను శంకర్‌గౌడ్‌ కలిశారు. ఇందుకు మూడు లక్షల లంచమివ్వాలని డిమాండ్‌చేశారు. దీంతో శంకర్‌గౌడ్‌ ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం తాసిల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ ప్రైవేట్‌ అసిస్టెంట్‌ లింగమూర్తికి రూ.లక్ష అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. విచారణ తర్వాత తాసిల్దార్‌ సంపత్‌కుమార్‌, ఆర్‌ఐ అజిమొద్దీన్‌, ఆర్‌ఐ అసిస్టెంట్‌ లింగమూర్తిని అరెస్ట్‌ చేశారు.