ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఫారెస్టు అధికారులు

టింబర్‌ డిపో అనుమతికి రూ.80 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ రేంజ్‌ ఫారెస్టు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ ఫారెస్టు రేంజ్‌ పరిధిలోని కొత్వాల్‌గూడలో టింబర్‌ డిపో ఏర్పాటు కోసం ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన వెంకటేశ్‌ ఫారెస్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

అనుమతి ఇచ్చేందుకు ఫారెస్టు రేంజ్‌ అధికారి శ్యామ్‌కుమార్‌, సెక్షన్‌ అధికారి పిర్యానాయక్‌ రూ.80 వేలు లంచం అడిగారు. సదరు వ్యాపారి ఏసీబీ అధికారులు అశ్రయించారు. బుధవారం శంషాబాద్‌ గగన్‌పహాడ్‌లోని కార్యాలయంలో 80 వేలు లంచం తీసుకుంటుండగా శ్యామ్‌కుమార్‌, పిర్యానాయక్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం గురువారం రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.