కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

నెవెడా ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొంటున్న కేటీఆర్‌
దావోస్‌ వేదికగా తెలంగాణ ఖ్యాతిని 117 దేశాల ముందు ఆవిష్కరించిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి ఆహ్వానం అందింది. అమెరికాలోని నెవెడాలో ఈ ఏడాది మే 17 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొనాలని కోరుతూ మంగళవారం ఈడబ్ల్యూఆర్‌ఐ (వరల్డ్‌ ఎన్విరాన్‌మెంటల్‌, వాటర్‌ రిసోర్స్‌ కాంగ్రెస్‌) ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్‌ సమ్మతిస్తూ హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1,200 మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. పర్యావరణం, జలవనరుల నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. తాజా అధ్యయన నివేదికలు, పలు కేస్‌ స్టడీలను విశ్లేషించనున్నారు.