- మూడేండ్లలో అట్టడుగు స్థానానికి భారత్
- ఎన్విరాన్‌మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో మన దేశానిది 180వ స్థానం
- మోదీ సర్కారుకు స్పష్టమైన విధానం లేకపోవటం వల్లే ఈ దుస్థితి
- ఉన్న రక్షణ చట్టాలకూ కేంద్రం తూట్లు
- గ్రీన్‌ట్రిబ్యూనల్, ఈఏఐ నిర్వీర్యానికి కుట్ర
- వ్యతిరేకిస్తున్న వారిపై రాజద్రోహం కేసులు
- నేడు ప్రపంచ పర్యావరణ దిన్సోతవం
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో చైతన్యాన్ని పెంచడంతోపాటు, పర్యావరణ హితానికి విధానపరమైన చర్యలను తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేకుండా పోయింది. పర్యావరణ పరిరక్షణకు అన్ని ఉపశమన చర్యలు చేపడుతామని, ప్రపంచ సంస్థలతో కలిసి పనిచేస్తామని, సహజ వనరులైన బొగ్గు తదితర ఖనిజాల యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని 2014 నాటి ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వస్తున్నది. సహజవనరులను, పర్యావరణాన్ని కార్పొరేట్ సంస్థలు దోచుకునేందుకు వీలుగా మోదీ ప్రభుత్వం ఒక్కో చట్టాన్ని పెకిలించివేస్తున్నది. ఫలితంగా పర్యావరణ పనితీరు సూచిలో భారత్ 180వ స్థానానికి పడిపోయింది.
పర్యావరణ చట్టాలకు కేంద్రం తిలోదకాలు..
- కాలుష్యం తీవ్రంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతాలలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై ఉన్న నిషేధాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎత్తేసింది. మధ్యతరహా పరిశ్రమల పరిధిని 10 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లకు కుదించింది.
- బొగ్గు, తారు, ప్రాసెసింగ్, ఇసుక తవ్వకం, కాగితపు గుజ్జు పరిశ్రమలకు సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలను, ఆంక్షలనూ తొలగించింది.
- ఇక జాతీయ జీవవైవిధ్య వన్యప్రాణుల సంస్థను బలహీనపర్చింది. సంస్థ స్వతంత్ర సభ్యుల సంఖ్యను 15 నుంచి 3కు తగ్గించింది.
- గతంలో ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులను ఉల్లంఘించి కాలుష్య కారకాలను విడుదల చేయడాన్ని మరో ఐదేండ్ల వరకూ పొడిగిస్తూ.. 420 థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు అనుమతినిచ్చింది.
- 2019లో వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్టులు ఉండరాదన్న నిబంధనలను కేంద్రం సడలించింది.
- ఉత్తరాఖండ్‌లో దేవాలయాల సందర్శనకు నిర్మించిన హైవేల కోసం 25 వేల చెట్లను నరికివేసేందుకు కేంద్రం అనుమతించింది.
- బొంబాయి సమీపంలోని విస్తారమైన భూములను రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉప్పు కొటారులను చిత్తడి నేలలుగా ప్రకటించింది. బీజేపీ పాలిత గోవాలో కొబ్బరి చెట్లను గడ్డిగా వర్గీకరించి రియల్ ఎస్టేట్ రంగానికి మేలు చేసే ప్రయత్నం చేసింది.
గ్రీన్ ట్రిబ్యునల్‌ను నీరుగార్చే కుట్రలు..
దేశ పర్యావరణ పరిరక్షణపై ప్రభావం చూపే ప్రతీ నిర్ణయాన్ని సమీక్షించే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్వయంప్రతిపత్తిని నీరుగార్చడానికి కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఎన్జీటీకి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం వహించాల్సి ఉండగా, 25 ఏండ్ల అనుభవం ఉన్న ఎవరైనా చైర్మన్ కావచ్చునంటూ ప్రభుత్వం సవరించింది. ఐదుగురు సభ్యుల కమిటీలో నలుగురు సభ్యులను ప్రభుత్వమే నామినేట్ చేయనుండగా, చైర్‌పర్సన్‌ను వారే ఎన్నుకుంటారని నిర్దేశించింది. ఎన్జీటీనీ బలహీనపరిచే ఈ సవరణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏదైనా ప్రాజెక్టును నెలకొల్పేముందు స్థానికులను సంప్రదించి, వారి అనుమతులు పొందాలన్న పర్యావరణ ప్రభావ అంచనా చట్టం (ఈఐఏ) నిబంధననూ మోదీ ప్రభుత్వం తొలగిస్తూ ఈఐఏ-2020 సవరణను లాక్‌డౌన్ సందర్భంలో తీసుకువచ్చింది. పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో దాని అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.
వ్యతిరేకిస్తే రాజద్రోహమే
కార్పొరేట్ కంపెనీల కోసం పర్యావరణంపై కేంద్రం చేస్తున్న దాడిని నిరసిస్తూ స్వచ్ఛందసంస్థలు, పర్యావరణ ప్రేమికులు దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలను చేపడుతున్నారు. అయితే వారిపైనా కేంద్రం కక్షగట్టి వ్యవహరిస్తున్నది. పరోక్షంగా రాజద్రోహం కేసులు పెట్టి వేధిస్తున్నది. ఈఐఏ-2020కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన పర్యావరణ ఉద్యమకారిణి, ‘ఫ్రైడే ఫర్ ప్యూచర్’ వ్యవస్థాపకురాలు దిశ రవిపై ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమ సందర్భంలో కేంద్రం దేశద్రోహ నేరం మోపి నిర్బంధించింది. గ్రీన్‌పీస్ ఇండియా శాఖ ప్రతినిధి ప్రియా పిైళ్లె అంతర్జాతీయ వేదికలపై విమర్శించడాన్ని తట్టుకోలేకపోయిన మోదీ ప్రభుత్వం.. విదేశాలకు వెళ్లకుండా ఆమెపై ఆంక్షలు విధించింది.
దేశానికి తెలంగాణ స్ఫూర్తి
పర్యావరణ పరిరక్షణ అంశంలో దేశానికి తెలంగాణ స్ఫూర్తిగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే దిశగా విజయవంతంగా ముందుకుసాగుతున్నది. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కోల్పోయిన అటవీ విస్తీర్ణానికి సమానంగా మరోచోట భూమిని కేటాయించడం, అక్కడ మొక్కలను నాటడమేకాదు పరిరక్షించడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. మురుగునీటి శుద్ధి, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి తదితర కార్యక్రమాలతో వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తూ ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తినిస్తున్నది. అవార్డులను సొంతం చేసుకుంటున్నది.
కెనడాకు చెందిన మెక్‌కాల్-మాక్ బెయిన్ ఫౌండేషన్ తాజాగా వెలువరించిన 180 దేశాల ఎన్విరాన్‌మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఈపీఐ)-2022లో భారత్ అట్టడుగున నిలిచింది. 2020లో దేశం 177వ ర్యాంకును సాధించగా.. మూడేండ్లలో మరో మూడు స్థానాలు దిగజారి 180వ స్థానానికి పడిపోయింది. మొత్తంగా గడిచిన పదేండ్లలో పర్యావరణ పరిరక్షణ అంశంలో దేశం సాధించిన ప్రగతి మైనస్ 0.6 శాతం.
ఈపీఐలో విభాగాల వారీగా భారత్ ర్యాంకు..
- 165 ైక్లెమేట్ చేంజ్ పాలసీ అమలు
- 178 పర్యావరణ ఆరోగ్యం
- 178 పర్యావరణ వ్యవస్థ-జీవశక్తి
- 179 గాలి నాణ్యత
- 135 పారిశుధ్యం, తాగునీరు
- 174 నీటిలోఖనిజాలు
- చెత్త నిర్వహణ 151
- జీవవైవిధ్య పరిరక్షణ 178
- పర్యావరణ సానుకూలత 97
- 132 ఆమ్లవర్షాల ప్రభావం
- 112 నీటివనరుల కాలుష్యం
సోర్స్: నమస్తే తెలంగాణ