తెలంగాణ పచ్చదనం.. దేశానికి ఆదర్శం

  • మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి
  • హరితహారం, గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ భేష్‌
  • ఎంపీ సంతోష్‌కుమార్‌ యువతకు ఆదర్శం
  • సేవ్‌ సాయిల్‌, గ్రీన్‌ చాలెంజ్‌ లక్ష్యం ఒక్కటే
  • ఐదోవిడత గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు
  • త్వరలో వినూత్న కార్యక్రమాలు: ఎంపీ సంతోష్‌

తెలంగాణకు హరితహారం, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ద్వారా పచ్చదనం పెంపు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ విషయాల్లో పోటీని స్వీకరించాలని ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు సూచించారు. భూమిని, భూసారాన్ని కాపాడటమే లక్ష్యంగా ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రజలను ఒకచోట చేర్చి అవగాహన కల్పించే ఉద్దేశంతో మోటర్‌సైకిల్‌పై చేపట్టిన ప్రపంచయాత్రలో భాగంగా హైదరాబాద్‌ మీదుగా బెంగుళూరు పయనమయ్యారు. మార్గమధ్యంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఐదోవిడతను శంషాబాద్‌ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం సద్గురు ప్రారంభించారు.

సద్గురుకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌, శంభీపూర్‌ రాజు, దండే విఠల్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఫొటో ప్రదర్శనను సద్గురు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణకు హరితహారం ప్రగతి నివేదికను వివరించారు.

ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ… ‘భూమిని రక్షించు’ (సేవ్‌ సాయిల్‌) ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం తనను ఆకర్షించిందని చెప్పారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌చాలెంజ్‌ చాలా గొప్పగా ఉన్నదని ప్రశంసించారు. హరితహారం ప్రజా ఉద్యమమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకొని మొక్కలు నాటడం అభినందనీయమని తెలిపారు. హైదరాబాద్‌ నగరమంతా పచ్చగా కనిపిస్తున్నదని, భూగోళంపై పంటలు, పశుగ్రాసం, వృక్షాలు ఉంటేనే పచ్చదనం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్‌ కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని, తెలంగాణ బిగ్‌ గ్రీన్‌స్పాట్‌గా మారడం సంతోషంగా ఉన్నదని సద్గురు తెలిపారు. దేశం పచ్చగా ఉండాలనే ఆలోచనతో చిన్న వయస్సులోనే గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ వంటి పెద్ద కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ యువతకు ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు. సేవ్‌ సాయిల్‌, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని, పుడమిని కాపాడుతూ.. ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియచెప్పటమే అన్నారు. హరితహారంలో తెలంగాణ రికార్డులు సాధించడమే కాకుండా, ఇతర దేశాలకు, రాష్ర్టాలకు మాడల్‌గా నిలువడంపై హర్షం వ్యక్తం చేశారు.

పూర్వజన్మ సుకృతం: ఎంపీ సంతోష్‌కుమార్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నాలుగు విడతలు విజయవంతం కావడం, సద్గురు ఆశీస్సులు పొండడం పూర్వజన్మ సుకృతమని ఎంపీ సంతోష్‌కుమార్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేండ్ల కిందట గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ చేపట్టామని తెలిపారు. ఐదో వసంతంలోకి అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్‌ ఇండియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయంవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ సంతోష్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

మట్టిని కాపాడుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

పట్టెడన్నం పెట్టే మట్టిని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని, నేల తల్లి సారాన్ని కోల్పోతే పంటలు పండవని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఫలితంగా దుర్భిక్షంతో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం నుంచి మట్టిని కాపాడుకోవాలని, సారవంతమైన నేలలను సంరక్షించుకోవాలని పిలుపునిస్తూ ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్‌సాయిల్‌’ పేరుతో సద్గురు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఐదోవిడత గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని సద్గురు చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. క్షీణించిన అటవీ ప్రాంతం పునరుజ్జీవనంలో భాగంగా పదివేల మొక్కలునాటే మహా కార్యక్రమాన్ని తెలంగాణ అటవీశాఖ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌తో కలిసి నిర్వహించిందని పేర్కొన్నారు.

పదివేల మందితో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

గొల్లూరు ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతం లో భారీగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో యాదాద్రి మాడల్‌ ప్లాంటేషన్‌ను అటవీశాఖ సహకారంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ చేపట్టింది. తొలిదశలో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. అటవీ పునరుద్ధరణలో భాగంగా ఐదోవిడత గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో ఒకేసారి పదివేల పెద్ద మొక్కలను నాటారు. కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, ప్రభుత్వ సలహాదారు ఆర్‌ శోభ, పీసీసీఎఫ్‌ హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ ఆర్‌ఎం డోబ్రియల్‌, అదనపు పీసీసీఎఫ్‌ సునీతా భగవత్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, రంగారెడ్డి డీఎఫ్‌వో జానకీరాం, ఎఫ్‌ఆర్వో విష్ణు, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్‌రెడ్డి, టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యుడు కిషోర్‌గౌడ్‌, ఈశా ఫౌండేషన్‌ వలంటీర్లు పాల్గొన్నారు.