ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలందించడంలో భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ) ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. తన ఖాతాదారులకు తాజాగా 1800 1234 అనే కాంట్రాక్ట్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చింది. ఖాతాదారులు ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే, ఇంటి వద్ద నుంచే వివిధ రకాల ఆర్థిక సేవలు తేలిగ్గా పొందొచ్చు. దీనివల్ల రోజువారీ ప్రాథమిక కార్యకలాపాల కోసం ఎస్బీఐ ఖాతాదారులు తమ బ్యాంకు శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. తద్వారా కొంత సమయం కలిసి వస్తుంది కూడా.
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు బ్యాంకింగ్ సేవల సాయం కోసం ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే సరి. ఖాతాలో బ్యాలెన్స్‌తోపాటు చివరి ఐదు లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏటీఎం కార్డు పోయినా.. దెబ్బతిన్నా.. దాన్ని బ్లాక్ చేసి, కొత్త డెబిట్ కార్డు జారీ చేయమని ఈ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్‌కు కాల్ చేసి చెప్పొచ్చు. కొత్త ఏటీఎం కార్డు డిస్పాచ్ స్టేటస్, చెక్‌బుక్ డిస్పాచ్ స్టేటస్, టీడీఎస్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పైన పేర్కొన్న సేవలు 24X 7 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా బ్యాంకు అందిస్తున్న వివిధ డిపాజిట్, రుణ పథకాలు, సేవల సమాచారం 24 గంటలూ తెలుసుకోవచ్చు.
కొత్తగా ఎస్బీఐ ప్రతిపాదించిన 1800 1234 టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు 1800 11 2211, 1800 425 3800, 1800 2100, 080-26599990 అనే టోల్ ఫ్రీ నంబర్లకు కూడా కాల్ చేసి.. ఖాతాదారులు తమకు అవసరమైన సేవలు పొందొచ్చు. ఈ టోల్ ఫ్రీ నంబర్లకు దేశంలోని మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసి బ్యాంకింగ్ సేవలు పొందడంతోపాటు ఖాతాదారులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో ఫోన్ కాల్ చేసి ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం. అటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్బీఐ రెండు ఈ-మెయిల్స్ అందుబాటులో ఉంచింది. [email protected], [email protected] అనే ఈ-మెయిల్స్‌కు ఖాతాదారులు తమ ఫిర్యాదులు చేయొచ్చు. ఖాతాదారుల ఫిర్యాదు రిజిస్టరైన తర్వాత దాని నంబర్, తదితర వివరాలు వారి ఫోన్ నంబర్‌కు వస్తాయి.
ఎస్సెమ్మెస్ ద్వారా తమ శాఖలకు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఖాతాదారులకు ఎస్బీఐ కల్పించింది. అలా ఎస్సెమ్మెస్ ద్వారా ఫిర్యాదు చేయదలిచిన కస్టమర్లు help అని టైప్ చేసి 91 81085 11111 అనే నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపాలి. దానిపై వచ్చిన రిప్లయ్ పట్ల సంతృప్తి కలుగకపోయినా unhappy అని టైప్ చేసి, 8008 202020 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపాలి.
ఖాతాదారుడు తన ఏటీఎం కం డెబిట్ కార్డు కోల్పోయినా.. చోరీకి గురైనా ఎస్సెమ్మెస్ పంపి, దాన్ని బ్లాక్ చేయొచ్చు. అందుకోసం BLACK XXXX (డెబిట్ కార్డులోని చివరి నాలుగు అంకెలు) అని టైప్ చేసి, 567676 ఎస్సెమ్మెస్ పంపాలి.