తెలంగాణలో 3.64 లక్షల మంది రైతులకు కొత్తగా రైతుబంధు

తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఫోన్లకు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి టింగ్‌ టింగ్‌మంటూ మెసేజ్‌లు రానున్నాయి. రైతుబంధు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఎప్పటిలాగే తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తర్వాత క్రమపద్ధతిలో రైతులందరికీ జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా 3.64 లక్షల మంది రైతులకు కూడా రైతుబంధు సాయం అందనున్నది. గత సీజన్‌తో పోల్చితే లబ్ధిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఈ వానకాలం సీజన్‌కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్కతేల్చింది. ఈ సీజన్‌లో రైతుబంధు పంపిణీ కోసం రూ.7,654.43 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ తెలిపింది. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతుబంధు జమ చేయనున్నది. తొలిరోజైన మంగళవారం ఎకరం భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు రూ.586.65 కోట్లు ఖాతాల్లో జమవుతాయి.