
మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్ అందించగలమని కామారెడ్డి ఎస్పీ ఎన్. శ్వేత అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా.. మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన కామారెడ్డి ఎస్పీ శ్వేత ఇవాళ ఎస్పీ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వ్యక్తి మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురి చేత మొక్కలు నాటించాలన్న సంకల్పం చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమవడం చాలా సంతోషంగా ఉందని ఎస్పీ తెలిజయేశారు.
జీవకోటికి ప్రాణాధారం ఆక్సిజన్ అనీ, చెట్లు కనుమరుగైతే కృత్రిమ ఆక్సిజన్ పీల్చే స్థితి వస్తుందనీ.. అలాంటి పరిస్థితి రాకూడదంటే, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తరించి భావితరాలకు మేలు జరిగేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత.. మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసిరి, మొక్కలు నాటాలని విన్నవించారు. వారిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ పి. నరసింహ రావు, సుభాష్, ఆర్ఎస్ఐ పనినహార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.