బీజేపీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల‌ దేశం ప‌రువుపోతున్న‌ది : సీఎం కేసీఆర్‌

దేశంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తున్న‌దని, బీజేపీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల దేశం ప‌రువుపోతున్న‌ద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. దేశంలో ఎన్న‌డూ లేనివిధంగా నిరుద్యోగిత 8.3శాతానికి పెరిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. దేశంలో ఏటా కోటి 30 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోతున్నార‌ని తెలిపారు.

చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేనివిధంగా మోదీ హ‌యాంలో రూపాయి ప‌త‌న‌మైంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రూపాయి ప‌త‌నంపై గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు మోదీ మాట్లాడార‌ని, భార‌త్‌లో రూపాయి విలువ ఘోరంగా ప‌త‌న‌మైన‌ట్లు గ‌తంలో చెప్పార‌న్నారు. మోదీ గతంలో లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ను ఇప్పుడు తాము అడుగుతున్నామ‌ని, ఆయ‌న స‌మాధానం చెప్పాల‌న్నారు. బీజేపీ స‌ర్కారు అస‌మ‌ర్థ‌త వ‌ల్లే రూపాయి విలువ రూ. 80కి ప‌డిపోయింద‌ని తెలిపారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాల‌న‌లో దేశానికి చేసిన ఒక్క మంచిప‌ని చెప్పాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశ‌ప్ర‌జ‌ల‌కు విద్యుత్, తాగు, సాగునీరు ఇవ్వ‌ని అస‌మ‌ర్థులు బీజేపీ నాయ‌కుల‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశ‌వ్యాప్తంగా 70వేల టీఎంసీల జ‌లాలున్నాయ‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకునే తెలివి బీజేపీ స‌ర్కారుకు లేద‌న్నారు. దేశ రాజ‌ధానిలో విద్యుత్ కోత‌లు, మంచినీటి కొర‌తే బీజేపీ పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు.

ఆర్‌బీఐ లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ జీడీపీ 128.3 అని, అదే కేంద్రం జీడీపీ 89.6 మాత్ర‌మేన‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ స్థాయిలో కేంద్రం ప‌నిచేస్తే జీడీపీ మ‌రింత పెరిగేద‌న్నారు. కేంద్ర విధానాల వ‌ల్ల తెలంగాణ మూడు ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌పోయింద‌ని తెలిపారు. చేత‌గాని బీజేపీ ప్ర‌భుత్వాన్ని క‌చ్చితంగా మారుస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్రంలో కూడా తెలంగాణ మాదిరి స‌ర్కారు రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. కేంద్రంలో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు రావాల‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ వేగం త‌క్కువ‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ వేగం ఎక్కువ‌ని తెలిపారు. మ‌రి దేశంలో బీజేపీ డ‌బుల్ ఇంజిన్ ఉండాలా? బీజేపీయేత‌ర డ‌బుల్ ఇంజిన్ ఉండాలా? ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌న్నారు.

బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌తో అంత‌ర్జాతీయంగా దేశం ప‌రువు పోయింద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. నుపుర్‌శ‌ర్మ వ్యాఖ్య‌ల‌తో విదేశాల్లో భార‌త రాయ‌బారిని నిల‌దీస్తే క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని గుర్తుచేశారు. నుపుర్‌శ‌ర్మ వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు జడ్జీలు మండిప‌డితే.. న‌లుగురు రిటైర్డ్ జ‌డ్జిల‌ను తీసుకొచ్చి సుప్రీంకోర్టు ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటింద‌ని ట్రోలింగ్ చేస్తున్నార‌ని సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. సుప్రీంకోర్టు ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటింద‌ని రిటైర్డ్ జ‌డ్జీల‌తో లేఖ రాయిస్తారా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ నేత‌లు సుప్రీంకోర్టును కూడా బేఖాత‌రు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. స‌ర్కారు నడుపుతున్నారా? లేక‌ గుండాయిజం చేస్తున్నారా? అని నిల‌దీశారు.

బీజేపీకి అహంకారం పెరిగిపోయింద‌ని, ఆ పార్టీ నాయ‌కుల‌కు క‌ళ్లు నెత్తికెక్కి కారుకూత‌లు కూస్తున్నార‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. త‌మిళ‌నాడులో అన్నామ‌లై అనే త‌ల‌మాసిన బీజేపీ నాయ‌కుడు అక్క‌డ‌ ఏక్‌నాథ్ శిందే వ‌స్తాడంటూ ఊద‌ర‌గొడుతున్నాడ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో కూడా కొంద‌రు నాయ‌కులు ఏక్‌నాథ్ శిందే స‌ర్కారు వ‌స్తుందంటూ పిచ్చిమాట‌లు మాట్లాడుతున్నార‌ని, మొత్తం 110 సీట్ల‌లో ఉన్న మా ద‌గ్గ‌ర ఏక్‌నాథ్ షిండే వ‌స్త‌డా? అని ఎద్దేవా చేశారు. దేశంలో భీక‌ర కుంభ‌కోణాలు, భ‌యంక‌రమైన అనారోగ్య‌క‌ర విధానాలు పెరిగిపోయాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. దేశం బాగుప‌డాలంటే కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం మారి కొత్త ప్ర‌భుత్వం రావాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.