మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి : స్థానిక రైతుల డిమాండ్

  • వివాదాస్పదమౌతున్న నిన్నటి ప్రజాభిప్రాయ సేకరణ
  • నిన్న ఒక్కరోజే 17 క్రషర్ లపై ప్రజాభిప్రాయ సేకరణ
  • పిసిబి అధికారుల మెడకు బిగుస్తున్న ఉచ్చు
  • ఎన్.జి.టి.లో క్రషర్లపై కేసు ఉండగా ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్న స్థానిక రైతులు
  • నిన్నటి ప్రజాభిప్రాయ సేకరణపై పూర్తి వివరాలు వచ్చే ఆర్టికల్ లో చదవండి..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో మైనింగ్ రెన్యువల్ పై అధికారులు జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ వివాదాస్పదమౌతోంది. మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేసి మైనింగ్ ను ఎత్తెయ్యాల్సిందేనని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం గందరోగళ నడుమ సాగింది. నిన్న జరిగిన ప్రజాభిప్రాయసేకరణ మైనింగ్ మాఫియాకు అనుకూలంగానే జరిగింది తప్ప బాదితులకు న్యాయం చేసే విధంగా జరగలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బాధిత రైతులు మీడియాతో మాట్లాడారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో తమపైనే కేసులు పెట్టిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. మైనింగ్ జోన్ ప్రాంతంలో కాకుండా గ్రామ పంచాయతీ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

మైనింగ్ మాఫియాలో ఉన్న క్రషర్ యజమానులను ముందు పెట్టి అభిప్రాయం చెప్పమని అడిగితే చాలా మంది భయంతో వెనుకాడారని తెలిపారు. అంతేకాక ఎంతో మంది అడ్డమీద కులీ పనులకు వెళ్ళే వారిని తీసుకొచ్చి తమకు అనుకూలంగా చెప్పించుకున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసే విధానం ఇది కాదన్నారు. ఈ క్రషర్స్ ను మూసి వేయాలని గతంలోనే ఆదేశాలు వచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తాము పిటిషన్ వేయడం జరిగిందని, కేసు నడుస్తున్న సమయంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ పే కూలీలు ఉన్నట్లు, తప్పు దారి పట్టించేందుకే కింది స్థాయి అధికారులు, ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, క్రషర్ యజమానులతో కలిసి ఇలా చేశారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ చేసి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కోరారు. భూములు లాక్కొని కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని, రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది చనిపోయారని తెలిపారు.