పంటలకు నష్టం కలిగించే మైనింగ్ మాకొద్దు..

  • ఇందిరమ్మ ఇచ్చిన భూములు గుంజుకున్నారు.
  • మా పొలాలు మాకు ఇప్పించండి..
  • మైనింగ్ పక్కనే 530 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు మైనింగ్ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పంటలకు నష్టం కలిగించే మైనింగ్ మాకొద్దు.. మా భూములు మాకు కావాలంటూ నినదించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన వెంటనే పరిసర ప్రాంత రైతులు, స్థానిక నేతలతో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రతీక్ జైన్ మాట్లాడుతూఈ సమావేశంలో పర్యావరణ అనుమతులపైనే ప్రసంగించాలని సూచించారు.

రైతులు మాట్లాడుతూ 1975 సంవత్సరంలో తమకు 22 సర్వే నంబర్లోని సుమారు 42.03 ఎకరాలు భూమికి పట్టాలిచ్చారన్నారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ అన్నయ్య అశోక్ గౌడ్ తమకు మాయమాటలు చెప్పి తమ భూములను లీజుకు తీసుకున్నారన్నారు. తదనంతరం అశోక్ గౌడ్ నుంచి జగదీశ్వర్ రెడ్డి మరికొన్ని రోజులు ఈ భూముల్లో మైనింగ్ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. తర్వాత జంగారెడ్డి 12.95 హెక్టార్లలో శ్రీ మైక్స్ అనే పేరుతో మైనింగ్ పనులు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుమారు 30 మంది రైతుల వరకు ప్రసంగించగా 20 మంది వరకు ఈ మైనింగ్ మాకొద్దని వ్యతిరేకించారు. మిగతా పదిమంది మైనింగ్ వల్ల తమకు ఏమీ నష్టం లేదన్నారు. దీంతో చాలామంది రైతులు ఒక్కసారిగా లేచి గొడవకు దిగారు. మరికొంత మంది రైతులు మాట్లాడుతూ ఈ మైనింగ్ కు పక్కనే అమ్రాయ చెరువు ఉందని ఈ మైనింగ్ నుంచి వచ్చే కాలుష్య వ్యర్థ పదార్థాలు, బాంబుల శబ్దాలకు చేపలు పెద్ద మొత్తంలో చనిపోయాయని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మైనింగ్ పక్కనే ఉన్న ఆవుల షెడ్లు కూలి పోయాయని, ఆవులు కూడా మృతి చెందాయని పేర్కొన్నారు. మైనింగ్ లో బాంబులు పెట్టడం వల్ల మా బోరుబావులు కూడుకుపోయి మోటార్లు కూడా బయటకు వెళ్లడం.. లేదని అదనపు కలెక్టర్ ఎదుట వాపోయారు. ముఖ్యంగా ఈ మైనింగ్ పక్కనే సుమారు 530 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం విశేషం. ఫారెస్ట్ ల్యాండ్ నిబంధన ప్రకారం కనీసం 500 మీటర్ల దూరంలో మైనింగ్ పనులు కొనసాగించాలని ఫారెస్ట్ నిబంధనలను కూడా తుంగలో తొక్కారు.

ఈ ప్రజాఅభిప్రాయ సేకరణలో రైతుల కన్నా ఎక్కువగా ఆయా పార్టీల ప్రజాప్రతిని రావడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇ.ఇ.లు వెంకన్న, రామప్పలు, ఆర్టీవో వెంకటాచారి, తహశీల్దార్ కృష్ణ, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు. గుజ్జుల మహేశ్, ఎన్జీవో నేతలు వెంకట్ రెడ్డి. స్థానిక సర్పంచ్ రఘుపతి,తుమ్మల కుంట తండా సర్పంచ్ లక్ష్మణ్, పెద్దూర్ సర్పంచు శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.