గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత రెండు నెలలుగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జూన్‌, జూలైలో గాలి నాణ్యత స్థాయిల్లో గణనీయమైన మెరుగుదల కనిపించి, సురక్షితమైన స్థానంలో నిలిచిందని పీసీబీ పేర్కొంది. పీసీబీ వెల్లడించిన నివేదిక ప్రకారం.. గ్రేటర్‌ వ్యాప్తంగా గాలి నాణ్యత బాగుందన్నారు. 2022 ప్రారంభం నుంచి ఏప్రిల్‌, మే వరకు బొల్లారం, సనత్‌నగర్‌, బాలానగర్‌, ఉప్పల్‌, జూబ్లీహిల్స్‌, చార్మినార్‌, అబిడ్స్‌తో సహా చాలా ప్రాంతాల్లో మోస్తరు స్థాయి అంటే 101 నుంచి 200 మధ్య ఉంది.

ఇది ఊపిరితిత్తులకు, ఆస్తమా, గుండె వ్యాధి రోగులకు ఇబ్బందికరమైంది. కాగా, జూన్‌, జూలై నెలల్లో ఒక్కసారిగా గాలి నాణ్యతలో చాలా మెరుగుపడిందని పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో 100 లోపే ఉన్నదని తెలిపారు. రాజేంద్రనగర్‌, కేబీఆర్‌ పార్కు పరిసర ప్రాంతాల్లో గత రెండు నెలల్లో గాలి నాణత్య అత్యుత్తమంగా ఉన్నదని వివరించారు. అబిడ్స్‌, చిక్కడపల్లి, నాచారం, సైనిక్‌పురి, ట్యాంక్‌బండ్‌, సనత్‌నగర్‌, జూపార్కు, పాశ మైలారం, ఇక్రిశాట్‌ తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత స్థాయి కనిష్ఠ ప్రభావంతో స్థిరంగా.. ఆమోదయోగ్యంగా ఉన్నదని తెలిపారు.