ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి

క్వారీ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకొంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన వీరమనేని కిషన్‌రావు కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి శివారులో మణికంఠ గ్రానైట్‌ క్వారీ నిర్వహిస్తున్నారు. క్వారీలో ఫోర్టబుల్‌ బాక్స్‌ అనుమతుల కోసం ఆముదాలపల్లి పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డిని కలిశారు.

ఎన్‌వోసీ కోసం పంచాయతీ కార్యదర్శి రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కిషన్‌రావు నుంచి కార్యదర్శి సత్యనారాయణరెడ్డి రూ.10 వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో పంచనామా నిర్వహించారు. నిందితుడి స్వగ్రామమైన వీణవంక మండలం అచ్చంపల్లిలోని నివాసంలోనూ సోదాలు చేశారు. సత్యనారాయణరెడ్డిని శుక్రవారం కరీంనగర్‌ ఏసీబీ స్పెషల్‌ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.