తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11.30కు వేర్వేరుగా ప్రారంభమవుతాయి. శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో దివంగతులైన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి), పరిపాటి జనార్దన్‌రెడ్డి (కమలాపూర్)కి సంతాపం ప్రకటిస్తూ ప్రకటన చేస్తారు. అనంతరం సభను ఈ నెల 12కు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటన చేసే అవకాశముంది. సభ వాయిదా అనంతరం స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండా, సభ నిర్వహణ తేదీలను ఖరారు చేస్తారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 12 నుంచి రెండు లేదా మూడు రోజుల పాటు సభ జరిగే అవకాశమున్నట్లు తెలిసింది. బీఏసీలో వచ్చే సూచనల ఆధారంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో అసెంబ్లీ కొనసాగే అవకాశముంది. ఈ నెల 7న కశ్మీర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’యాత్రను ప్రారంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
