జమ్మిని, పాలపిట్టను కాపాడుకుందాం : ఎంపీ సంతోష్‌కుమార్‌

జమ్మిచెట్టు, పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా దసరా సందర్భంగా ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో ఒక జమ్మిచెట్టును నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. బుధవారం ఆయన కొత్తగూడ బొటానికల్‌ గార్డెన్‌లో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారితో కలిసి జమ్మిమొక్కలు నాటారు. అనంతరం అటవీ, దేవాదాయశాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల జమ్మిమొక్కలు నాటే కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ.. పురాణాల్లో జమ్మికి విశిష్ట స్థానం ఉన్నదని చెప్పారు.

వేదకాలం నుంచి భక్తి పూర్వకంగా అందరూ పూజించుకొనే జమ్మిచెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. వివిధ కారణాలతో అంతరించిపోతున్న జమ్మిచెట్లను నాటే కార్యక్రమాన్ని సంతోష్‌కుమార్‌ చేపట్టడం అభినందనీయమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సంతోష్‌కుమార్‌ పర్యావరణంతోపాటు సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయమని ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వేదకాలం నుంచి నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ప్రతి ఊరిలో, గుడిలో పెంచాలనుకోవడం గొప్ప ఆలోచన అని కేవీ రమణాచారి పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని బొటానికల్‌ గార్డెన్‌ వాకర్స్‌ అసోసియేసన్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2న నిర్వహించనున్న రన్‌ ఫర్‌ ఫీస్‌ కార్యక్రమం పోస్టర్‌, టీషర్టును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్‌కుమార్‌ అవిష్కరించారు. బొటానికల్‌ గార్డెన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడిగా సంతోష్‌కుమార్‌ను ఎన్నుకొన్నారు.