సాహితీ ప్రియుడు, అనువాదకుడు, వర్ధమాన కవులు, రచయితలను వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ముందుండే నిజాం వెంకటేశం(76) ఇకలేరు. ఆయన ఆదివారం రాత్రి 8 గంటలకు పద్మారావు నగర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వెంకటేశం స్వస్థలం సిరిసిల్ల. ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పదవీ విరమణ పొందారు. తెలంగాణలో కవిత్వాభిలాషను పెంపొందించేందుకు 1790 దశకంలో ‘దిక్సూచి’ కవిత్వ పక్ష పత్రికను తీసుకొచ్చారు. ప్రముఖ కవులు అలిశెట్టి ప్రభాకర్, సుద్దాల అశోక్ తేజ వంటి వారిని తొలినాళ్లలో వెంకటేశం ప్రోత్సహించారని రచయిత పత్తిపాక మోహన్ గుర్తుచేసుకున్నారు. న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి ఆర్థికశాస్త్ర అంశాలపై ఆంగ్లంలో రాసిన పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతి మీదా వెంకటేశం పుస్తకం రాశారు. ప్రసిద్ధ రచయిత అల్లం రాజయ్య ‘మనసు లోపల విధ్వంసం’ తదితర కథలను ఆంగ్లంలోకి అనువదించారు. ఇవిగాక తెలంగాణ భాషాశాస్త్ర పరిశోధకుడు నలిమెల భాస్కర్, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం తదితరుల కథలు, కవిత్వాన్ని సంపుటాలుగా తీసుకొచ్చారు. సాహితీకారులకు చేదోడు వాదోడుగా ఉండే నిజాం వెంకటేశం మృతి బాధాకరం అని చరిత్ర పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు విచారం వ్యక్తం చేశారు. భాషా శాస్త్ర పరిశోధకుడు నలిమెల భాస్కర్, నేషనల్ బుక్ ట్రస్ట్ అసిస్టెంట్ ఎడిటర్ పత్తిపాక మోహన్, ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ వేముల సత్యనారాయణ తదితరులు నివాళులు అర్పించారు. వెంకటేశం అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు సమాచారం.
