లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ.. రూ. 90 వేలు సీజ్

కరీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. కొత్త‌ప‌ల్లి మండ‌లం ఆసిఫ్‌న‌గ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ ఉట్కూరి శ్రీధ‌ర్.. నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ కోసం ఇచ్చేందుకు రూ. 90 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆసిఫ్‌న‌గ‌ర్‌లో ఇండ‌స్ట్రీయ‌ల్ యూనిట్ ఏర్పాటు కోసం ఎన్‌వోసీ ఇవ్వాల‌ని ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి పంచాయ‌తీ సెక్ర‌ట‌రీని కోరాడు. ఇందుకు లంచం డిమాండ్ చేయ‌డంతో.. బాధిత వ్య‌క్తి ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. ఇవాళ క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ వ‌ర్క్ షాపు వ‌ద్ద శ్రీధ‌ర్ లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం పంచాయ‌తీ కార్యాల‌యంతో పాటు శ్రీధ‌ర్ నివాసాల్లో త‌నిఖీలు కొన‌సాగిస్తున్నారు.