కాలుష్య సమస్యపై స్థానిక ప్రజలు పోరాటం మొదలు పెట్టారు. కాలుష్య పరిశ్రమలను కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోకవడంతో కాలుష్య సమస్యతో బాధపడుతున్న ప్రజలే ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబందిత అధికారులు కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకొని తమ చిత్తశుద్దిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ పరిశ్రమ నుంచి వెదజల్లిన దట్టమైన పొగ దుర్వాసనతో కూడిన విషవాయువు పీల్చడంతో పిల్లలు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఆగ్రహించిన గ్రామస్తులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనోహరబాద్ మండలంలోని రంగాయిపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల మధ్యలో ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ నుండి ప్రతిరోజు సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు దట్టమైన పొగతో కూడిన విషవాయువుతో ఈ గ్రామాలను కమ్మేస్తున్నది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విషవాయువుతో కూడిన దుర్వాసన, దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఈ విషవాయువును పీల్చిన రంగాయపల్లి గ్రామానికి చెందిన వృద్ధులు, పిల్లలు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. ఆగ్రహించిన గ్రామస్తులు పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్సె రాజు గౌడ్ గ్రామస్తులతో మాట్లాడుతూ పరిశ్రమ యజమానులను సోమవారం గ్రామానికి పిలిపించి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. నెల రోజుల క్రితం ఇదే పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులు ఆందోళన చేయగా రెండు రోజుల్లో గ్రామసభ నిర్వహించి సమస్య పరిష్కరిస్తామని పరిశ్రమ యజమానులు హామీ ఇచ్చి ముఖం చాటేసారని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ తో పాటు పాలకవర్గం సభ్యులు విషవాయువుతో కూడిన పొగను అడ్డుకోవడానికి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. అయినా నేటికీ యజమానులు స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ పరిశ్రమ చేస్తున్న కాలుష్య సమస్య గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభంలేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు.