ఏసీబీకి చిక్కిన గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌ షేక్ ర‌బ్బానీ

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (GWMC) ప‌రిధిలో ప‌ని చేస్తున్న ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్, బిల్ కలెక్ట‌ర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. నిజాంపుర కాల‌నీకి చెందిన ఎస్. ల‌వ‌న్ కుమార్‌ దగ్గర రూ. 15 వేలు లంచం తీసుకుంటుండ‌గా, వారిద్ద‌రిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

త‌మ పూర్వీకుల నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన నివాసాన్ని విభ‌జించి, కొత్త ఇంటి నంబ‌ర్ల‌ను ఇవ్వాల‌ని ల‌వ‌న్ కుమార్.. కాశీబుగ్గ స‌ర్కిల్ ప‌రిధిలో రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌గా పనిచేస్తున్నషేక్ ర‌బ్బానీని సంప్ర‌దించాడు. దీంతో షేక్ ర‌బ్బానీ.. బిల్ క‌లెక్ట‌ర్ ముప్పిడి రంజిత్‌ (ఔట్ సోర్సింగ్‌) ద్వారా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్ర‌మంలో ల‌వ‌న్ కుమార్ ఏసీబీ అధికారుల‌ను సంప్ర‌దించాడు.

బుధ‌వారం ఉద‌యం సృష్టి హాస్పిట‌ల్ వ‌ద్ద రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్, బిల్ క‌లెక్ట‌ర్ క‌లిసి ల‌వ‌న్ కుమార్ వ‌ద్ద లంచం తీసుకుంటుండ‌గా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అనంత‌రం వారి కార్యాల‌యంతో పాటు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.