కేంద్రం అవలంభించే విధానాల వల్ల విద్యుత్, నీటి సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మన తెలంగాణను గుర్తు చేసుకోండి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పచ్చబడ్డది అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలాగే దేశాన్ని తయారు చేయాలని పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు ఇదో గొప్ప అవకాశం. చరిత్రలో సువర్ణ అవకాశం ఈ మునుగోడుకే దక్కింది. బీఆర్ఎస్కు పునాది రాయి పెట్టే అవకాశం మీకే దక్కింది. సిద్దిపేట ప్రజలు నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. మునుగోడు విజయంతోనే దేశం బాగుపడుతది. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను. మీకు అండదండగా ఉంటానని కేసీఆర్ తేల్చిచెప్పారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలే. ఎవరు చేయాలి ? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడితే.. ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు వేరుపడితే పెద్దలు ఏం చేస్తరు? ఇది నీదిరా.. గిది నీదిరా అని పంచుతరు? ఎనిమిదేళ్లవుతున్నది మహత్తరమైన ఘనత వహించిన బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీకి ఎనిమిదేళ్లు చాలలేదా? మా వాటా ఇవ్వడానికి.. ఎందుకివ్వవు మోదీ? నోరు పెగలదు.. నోరు తెరవదు. నేను మహామొండి మీకు తెలుసు. మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి.. తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారని.. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
నా బలగం, నా శక్తి మీరే. మీ బలం చూసే మేం కొట్లాడేది. మీరే సహకరించకపోతే మేం ఏం చేయగలుగుతాం. ఇవాళ మీటర్లు పెట్టేవారికి ఏం అవకాశం ఇచ్చినా నన్ను పక్కకు జరిపేస్తారు. కేసీఆర్‌ను పడగొట్టి, తెలంగాణను కబ్జా చేద్దామనుకున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రయివేటీకరణ చేద్దామనుకునే వాళ్లకు ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. భారతదేశంలో బంగారం లాంటి భూమి ఉంది. మానవ సంపద ఉన్నది. ఇవన్నీ వదిలిపెట్టి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంది. రైతులు గమనించాలి. నష్టపోయేది, కష్టపడేది మనమే అనేది గుర్తుకు తెచ్చుకోవాలి. గత పాలకుల హయాంలో నీటి గోస తీరిందా? ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించలేదు. మునుగోడు ప్రజలను కాపాడండి అంటే నాటి బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు. నేను కూడా ఇక్కడకు వచ్చిన ఏడ్చినా.. శివ్వన్నగూడెంలో నిద్ర చేసి, మేధావులతో మాట్లాడి చైతన్యం తీసుకొచ్చాను. సూడు సూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ అనే పాట నేనే రాశాను. నల్లగొండ, మునుగోడుకే కాదు.. భారత్‌కే నరకం చూపే జెండాలు మన మధ్య తిరుగుతున్నాయి. వాటిని గుర్తుపట్టాలి. ప్రజల్లో అమాయకత్వం ఉంటదో.. అప్పటి దాకా దుర్మార్గుల ఆటలు కొనసాగుతాయి. ఓటర్లు అందరూ అలవోకగా ఓటేసి ఇబ్బంది పడొద్దు అని కేసీఆర్ సూచించారు.
మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదు. ప్రతి విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి.. ఆవులను పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి. మునుగోడులో యుద్ధం చేయాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మునుగోడులో చేనేత కార్మికులు ఉన్నారు. దేశంలో ఏప్రధాని కూడా చేయని దుర్మార్గం మోదీ చేసిండు. ఇబ్బందుల్లో ఉన్న చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారు. ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయాలి. ఆలోచించాలి. నాకే ఓటు వేయ్ అని అడగడం ధర్మమేనా? ఇవాళ వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది. ఆ ఓటు బలంతోనే పోటు పొడుస్తానని చెప్పిన తర్వాత కూడా బీజేపీకే ఓటు వేయాల్నా? ఆలోచించాలి. పోస్టుకార్డు ఉద్యమంపై నిర్ణయం తీసుకోవాలంటే చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయొద్దు. నీ చేతిలో ఉన్న ఓటును బాగు, భవిష్యత్, దేశం కోసం వినియోగించమని చెబుతున్నాను.
దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ ఈ దేశం 2 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. ఏంది ఈ దుర్మార్గం. మన రాష్ట్రంలో తప్పా ఎక్కడా కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. కార్పొరేట్ల జేబులు నింపేందుకు బీజేపీ యత్నిస్తోంది. ప్రయివేటీకరణ అనే పాలసీని బీజేపీ అవలంభిస్తోంది. ఇది ఎంత వరకు కరెక్ట్. విద్యుత్ సంస్కరణల పేరిట విద్యుత్ మీటర్లు పెడుతామని చెబుతున్నారు. మీటర్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీటర్లను పెట్టుకుని కొంపలను పొగొట్టుకుందామా? ఈ విషయంపై ఆలోచించాలి. ఎన్నికల్లో చేసే దుర్మార్గపు ప్రలోభాలకు ఆశ పడితే గోస పడుతామని కేసీఆర్ పేర్కొన్నారు.