ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో శరత్‌రెడ్డి అరెస్టు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మనీ లాండరింగ్‌ కోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మనీ లాండరింగ్‌ కోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న అరబిందో ఫార్మా, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థల డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డిని గురువారం ఢిల్లీలో అరెస్టు చేసింది. ఆయనతోపాటు ఈ కేసుతో సంబంధమున్న మద్యం వ్యాపారి, ఫ్రెంచి మద్యం కంపెనీ పెర్నాడ్‌ రికార్డ్‌ ఢిల్లీ రీజినల్‌ హెడ్‌ వినయ్‌బాబును కూడా అదుపులోకి తీసుకుంది. అంతకు ముందు కొన్ని గంటలపాటు వారిద్దరినీ విచారించిన ఈడీ.. అనంతరం పీఎంఎల్‌ఏ చట్టం కింద అరెస్టు చేసింది. శరత్‌ చంద్రా రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బంధువు మాత్రమే కాకుండా ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఇక, అరెస్టు తర్వాత శరత్‌ చంద్రా రెడ్డి, వినయ్‌ బాబులను గురువారం మధ్యాహ్నం రౌజ్‌ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట హాజరు పరిచారు. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 7 రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి రోజు కొద్ది సమయం శరత్‌ చంద్రా రెడ్డి తన సతీమణిని కలుసుకోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.

కస్టడీలో ఇంటరాగేషన్‌ను వీడియో తీయాలని ఆయన తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీటీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక, ఇంటి భోజనాన్ని అనుమతించాలన్న న్యాయవాదుల అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. ‘‘ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచించనిదే ఇంటి భోజనాన్ని అనుమతించలేము. భద్రతా సమస్యలు ఏర్పడతాయి. ఎవరైనా కుట్ర చేసే అవకాశం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.

ఈడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాడి వేడి వాదనలు జరిగాయి. ఈ కేసులో శరత్‌ చంద్రా రెడ్డి సూత్రధారి (కింగ్‌ పిన్‌) అని ఈడీ తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీ లిక్కర్‌ పాలసీ ప్రకారం.. ఒక వ్యక్తికి రెండుకు మించి రిటైల్‌ జోన్లు ఉండరాదు. కానీ, శరత్‌ 5 జోన్లు పొందారు. ఇది పాలసీ ఉల్లంఘనే. అలాగే, ఒక పెద్ద కార్టల్‌లో శరత్‌ చంద్రా రెడ్డి కీలక భాగస్వామి. హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూటర్‌ అయిన ఇండో స్పిరిట్‌ కంపెనీలో బినామీ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టారు. కేసులో నిందితుడు విజయ్‌ నాయర్‌, ఇతరులతో కలిసి కుట్ర పన్నారు. ఈ వ్యవహారంలో రూ.3.5 కోట్ల మేర చేతులు మారాయి. దాదాపు రూ.60 కోట్ల మేర శరత్‌ చంద్రా రెడ్డి లబ్ధి పొందారు’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డిజిటల్‌ సాక్ష్యాలను నాశనం చేయడానికి కూడా శరత్‌ రెడ్డి ప్రయత్నించారని, ప్రాథమికంగా ఈ కేసులో శరత్‌ చంద్రా రెడ్డి కీలక వ్యక్తిగా తాము గుర్తించామని స్పష్టం చేశారు. ఈ కేసుతో 34 మంది వీఐపీలకు సంబంధం ఉందని భావిస్తున్నామని, వారిలో ప్రధాన నిందితులతోపాటు మద్యం వ్యాపారులు, ప్రభుత్వాధికారులు, ఢిల్లీ ఎక్సైజ్‌ మంత్రి తదితరులు ఉన్నారని చెప్పారు. డిజిటల్‌ సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడమే ధ్యేయంగా వారంతా 140 మొబైల్‌ ఫోన్ల (వాటి విలువ రూ.1.20 కోట్లు)ను మార్చారని తెలిపారు. నిజానికి, ఢిల్లీ మద్యం పాలసీని గత ఏడాది జూలై 5న విడుదల చేశారని, కానీ, కొంతమంది మద్యం వ్యాపారులకు రెండు నెలల ముందుగా అంటే మే 31వ తేదీనే లీక్‌ చేశారని కోర్టుకు వివరించారు.

వినయ్‌ బాబు ఈమెయిల్‌ ఖాతాను విశ్లేషించినప్పుడు ఆయనకు చాలా ముందుగానే మద్యం పాలసీ అందిందని, దానిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు కూడా ఆయనకు తెలుస్తున్నాయన్న విషయం తమకు తెలిసిందని చెప్పారు. కాగా, శరత్‌ చంద్రా రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది మను శర్మ వాదిస్తూ.. ఈ కేసులో శరత్‌ను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం జరిగిన నేరాన్ని సమర్థించేలా కస్టడీ అప్లికేషన్‌ ఉందని అన్నారు. గతంలో శరత్‌ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగిని విచారించారని, ఆయన చెప్పిన వివరాల ఆధారంగా మాత్రమే శరత్‌ను ఈడీ విచారిస్తోందని, ఆయనకు వ్యతిరేకంగా డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు లేవని వివరించారు. దాంతో, ‘డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దానికి ఈడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ వద్ద వాంగ్మూలాలు ఉన్నాయని, అవి సాక్ష్యాధారాలుగా చెల్లుతాయని సమాధానమిచ్చారు.

శరత్‌ రెడ్డి కంపెనీకి చెందిన చందన్‌ అనే ఉద్యోగిని ఈడీ విచారించిందని, ఆ సమయంలో ఈడీ అధికారులు హింసించారని, కొట్టారని కోర్టులో విచారణ సందర్భంగా శరత్‌ రెడ్డి తరఫు న్యాయవాది మను శర్మ ఆరోపించారు. దానిని ఈడీ న్యాయవాది ఖండించారు. తమకు అలాంటి ఫిర్యాదు ఏమీ రాలేదని స్పష్టం చేశారు. అయితే, ఈడీ అధికారులు కొట్టడంతో చందన్‌కు ఒక చెవి పూర్తిగా వినికిడి కోల్పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ కస్టడీలో శరత్‌ ఉండడం క్షేమం కాదని వాదించారు. దాంతో, చందన్‌ను కొట్టిన విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలని న్యాయమూర్తి సూచించారు. ఈ సందర్భంగా, శరత్‌ రెడ్డి కంపెనీ సిబ్బంది భయపడుతున్నారని మను శర్మ చెప్పగా.. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారికి భయం ఉండడం మంచిదేనని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ‘‘కొంత భయం మంచిదే. కానీ, మరీ ఎక్కువ భయం మంచిది కాదు’’ అని వ్యాఖ్యానించారు.