‘చందక్’ లేబోరేటరీ రసాయన పరిశ్రమ మూసివేత

  • ఫలించిన కొండమడుగు గ్రామస్థుల పోరాటం
  • చందక్ కంపెనీ మేనేజర్ కు మూసివేత ఆదేశాల కాపీ అందజేసిన అధికారులు

రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలని మండలంలోని కొండమడుగు గ్రామస్థులు గత 12 రోజులుగా కొనసాగిస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. గ్రామస్థుల ఆందోళనకు దిగివచ్చిన పీసీబీ అధికారులు ఎట్టకేలకు చందక్ లేబోరేటరీ రసాయన పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం పీసీబీ కార్యాలయ సిబ్బంది రసాయన పరిశ్రమ మేనేజర్ కొండారావుకు ఆదేశాల ప్రతులను అందజేశారు. గ్రామ శివారులో నెలకొల్పిన పలు రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థ రసాయనాలు వాయుకాలుష్యంతోపాటు భూగర్భజలాలను కలుషితం చేయడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈనేపథ్యంలో కొండమడుగు మెట్టు వద్ద చందక్ లేబోరేటరీ రసాయన పరిశ్రమ కొన్నిరోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురైంది.. దీంతో భయపడిన గ్రామస్థులు ప్రాణాంతకంగా మారిన రసాయన పరిశ్రమలతో ఇక ఆవాసం చేయలేమని భావించి కంపెనీ ఎత్తివేత కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. అందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి చందక్ కెమికల్ కంపెనీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంతేకాకుండా జాతీయ రహదారి దిగ్బందం, కలెక్టరేట్ ముట్టడి తదితర కార్యక్రమాలు చేపట్టి వివిధ రూపాల్లో పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇక్కడి ప్రజల పోరాటానికి అన్ని రాజకీయపక్షాలు మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా యాజమాన్యాలకు ఫోన్ చేసి కంపెనీలను స్వచ్చందంగా ఎత్తివేయాలని, లేదంటే తానే వేలాది మందితో వచ్చి ఆ పని చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గ్రామస్థులతో కలిసి ఆందోళనకు మద్దతు తెలిపి, రసాయన పరిశ్రమల ఎత్తివేతకు చర్యలు తీసుకున్నారు. పీసీబీ, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గురైన చందక్ రసాయన పరిశ్రమ మూసివేతకు పీసీబీ నుంచి ఆదేశాలు ఇప్పించారు. దీంతో సంబంధిత కార్యాలయ సిబ్బంది నేరుగా కంపెనీ వద్దకు వచ్చి మేనేజర్ కొండా రావుకు మూసివేత ఆదేశాల పత్రాలను అందజేశారు. దీంతో ప్రజల పోరాటానికి ఫలితం దక్కినట్లయింది.