ఆయిల్‌ పరిశ్రమకు అవసరమైన రాయితీలు కల్పిస్తాం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో వంట నూనెల ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని, అవ‌ర‌మైన రాయితీలు క‌ల్పిస్తామ‌ని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో జరుగుతున్న వెజ్‌ ఆయిల్‌, ఆయిల్‌ సీడ్‌ రంగంపై గ్లోబల్‌ రౌండ్ టేబుల్‌ సదస్సుకు మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో 20 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పామాయిల్ సాగు చేయ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు. ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే పామాయిల్ సాగు ప్రారంభ‌మైంద‌న్నారు. దీంతో పాటు వేరుశ‌న‌గ‌, పొద్దు తిరుగుడు, సోయాబిన్ లాంటి పంట‌ల‌ను పెద్ద ఎత్తున సాగు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ లాంటి జిల్లాల్లో సోయాబిన్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వేరు శనగ, ఇతర జిల్లాల్లో పొద్దు తిరుగుడు పంటను పండిస్తున్నారని తెలిపారు. ఇలా తెలంగాణలో ఆయిల్‌ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అందుబాటులో ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.. నూనె ఉత్పత్తుల పంటల సాగును ప్రొత్సహించడం ద్వారా ఆయిల్‌ దిగుమతులను తగ్గించుకోవచ్చని మంత్రి సూచించారు. దేశీయ అవసరాల్లో 60 శాతం ఆయిల్‌ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీనిని గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. తెలంగాణలో 10 వేల ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.