అరవింద్‌.. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తాం : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్‌కే అవమానకరంగా ఎంపీ ప్రవర్తన ఉందన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో యాక్సిడెంటల్‌గా గెలిచారని అన్నారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు.

‘ఇవాళ నేను బాధతో మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రజలు క్షమించాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నీతి, నిజాయితీ, ఒక పద్ధతి ఉంటుంది. సీఎం కేసీఆర్‌ని అనరాని మాటలు అంటున్నారు. నేను కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్‌ చెబుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు. ఇంత వరకూ నేను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోను. నా పుట్టుక, నా భవిష్యత్తు తెలంగాణ, టీఆర్‌ఎస్‌. బిడ్డా చెప్తున్నా.. గుర్తుపెట్టుకో. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెయ్‌ వెంటపడి ఓడిస్తాం’ అని అన్నారు.

పార్లమెంట్‌లో ఎంపీ అరవింద్‌ పెర్ఫార్మెన్స్‌ జీరో అని కవిత అన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏనాడు ప్రశ్నించలేదని చెప్పారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. ఎంపీ అరవింద్‌ ఫేక్‌ సర్టిఫికెట్లపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో గల అరవింద్‌ ఇంటిని జాగృతి, టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు ముట్టడించారు.