రామంతాపూర్‌ శివారులో క్రషర్‌ పేలుళ్లపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ

మాసాయిపేట మండలంలోని రామంతాపూర్‌ శివారులో గురువారం రాత్రి జరిగిన భారీ క్రషర్‌ పేలుళ్లపై తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్‌ శివారులోని వైష్ణవి గుట్ట వద్ద 389 సర్వే నెంబర్‌లో గురువారం పెద్దఎత్తున జరిగిన క్రషర్‌ పేలుళ్లతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ పేలుళ్ల కారణంగా పరిసరాల్లోని రైతుల పంట పొలాలు, అక్కడే ఉన్న పశువుల కొట్టాలతో పాటు డంప్‌యార్డు తదితర ప్రాంతాల్లో రాళ్లు పడి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో తూప్రాన్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో చేగుంట ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌ పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. డీఎస్పీ యాదగిరి రెడ్డి రైతులు, గ్రామస్థుల ద్వారా పేలుళ్ల తీవ్రత, జరిగిన నష్టంపై ఆరా తీశారు. అనంతరం మైనింగ్‌ శాఖ జిల్లా అధికారి ఏడీ జయరాజ్‌ నేతృత్వంలో జియోలాజికల్‌, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి రైతుల పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని, క్వారీలో మైనింగ్‌ నిలిపివేయాలని తెలిపారు.