క్వారీల ముప్పు.. ఏదీ కనువిప్పు?

• దెబ్బతింటున్న ఇళ్లు.. పూడిపోతున్న బోరుబావులు
• కొత్తవి వద్దంటూ ప్రజల అభ్యంతరం

పచ్చని పొలాల నిండా రాళ్లు, దుమ్ము పెరుకుపోతున్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటాయి. బోరుబావులు పూడుకు పోయి, మోటార్లూ అందులోనే కూరుకుపోతుంటాయి. క్వారీల్లో పేలుళ్లు జరిపే సమయంలో దట్టమైన పొగ, దుమ్ము ఊరంతా కమ్మేస్తుంది. ఫలితం శ్వాసకోశవ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది. క్వారీలు, క్రషర్ల సమీపంలోని గ్రామాల్లో నివసించే ప్రజలు ఈ బాధలన్నీ అనుభవించాల్సిన దయనీయ పరిస్థితి. అందుకే కొత్తవి ఏర్పాటు చేస్తామంటూ అధికారులు చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలకు వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఏకంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిల్లా పాలనాధికారికి లేఖ రాసి స్థానికుల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే వారు తిరగబడే అవకాశముందంటూ చెప్పడం పరిస్థితి. తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. జడ్పీ ఉపాధ్యక్షుడు కుంచాల ప్రభాకర్ తో పాటు జిన్నారం మండలం రాళ్లకత్వ, ఊట్ల గ్రామాలకు చెందిన రైతులు శనివారం కలెక్టరేట్ కు వచ్చారు. స్థానికులు ఎవరూ లేకుండా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలంటూ అదనపు పాలనాధికారి వీరారెడ్డికి వినతిపత్రం అందించారు.

ఈ ప్రాంతంలోనే ఎక్కువ..
జిల్లాలో మొత్తం 111 క్వారీలున్నాయని మైనింగ్ విభాగాధికారులు చెబుతున్నారు. కొత్తగా మరో 20 వరకు కార్యకలాపాలు ప్రారంభించేలా కనరత్తు సాగుతోందంటున్నారు. పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోనే క్వారీలు, క్రషర్లు ఎక్కువగా ఉన్నాయి. జిన్నారం మండలం పరిశీలిస్తే ఇక్కడే ప్రస్తుతం 22 ఉండగా.. మరో 20 వరకు కొత్తవి రాబోతున్నాయి. మాదారం, ఖాజీపల్లి, రాళ్లకత్వ, ఊట్ల, కొడకంచి తదితర గ్రామాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. దీంతో చాలా మంది రైతులు భూములను బీళ్లుగా ఉంచుతున్నారు. వీళ్ల నుంచి వ్యతిరేకత రావొద్దని కొందరు క్వారీల నిర్వాహకులు వారికి ఏటా ఎంతో కొంత పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటున్నారు. ఈ బాధలన్నింటినీ స్వయంగా చూసిన స్థానికులు ప్రస్తుతం కొత్తగా క్వారీలు ఏర్పాటు చేసేందుకు చేస్తున్న పనులను అడ్డుకుంటున్నారు.

అనుమతులొస్తే ఇబ్బందులే..
ఒక్కసారి అనుమతులు వస్తే క్వారీల నిర్వాహకులు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖలకు చెందిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్నిసార్లు ఫిర్యాదులిచ్చినా ప్రయోజనం ఉండటం లేదనేది రైతులు, స్థానికుల వాదన రాళ్లకత్వ, మాదారంలో చెరువుల పక్కనే క్వారీలున్నాయి. ఖాజీపల్లిలోని క్వారీల వల్ల పక్కనే ఉన్న అటవీ ప్రాంతం దెబ్బతింటోందని ఏకంగా ఆ శాఖకు చెందిన అధికారులే పేర్కొంటున్నారు. (సోర్స్: ఈనాడు)